యువతకు స్ఫూర్తినిచ్చిన చిత్రం మల్లేశం: లక్ష్మణ్ ఏలే

0
17
views

తల్లి కష్టాన్ని చూసి బాధపడి, ఆసుయంత్రాన్ని కనిపెట్టి ఎంతోమంది తల్లుల కష్టాన్ని దూరంచేసి పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మల్లేశం చిత్రం యువతకు స్ఫూర్తిగా నిలిచిందని చిత్ర ప్రొడక్షన్ డిజైన్, ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న బతుకమ్మ ఫిల్మోత్సవం (2019)లో శనివారం సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ‘మల్లేశం’ చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి చిత్ర ప్రొడక్షన్ డిజైన్, ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, నటుడు మల్లేష్ బలస్ట్ విచ్చేసి ప్రేక్షకులతో చిత్ర అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిలిం ఇన్సిట్యూట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ విజయ్ కుమార్ విచ్చేసి చిత్రబృందాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు.

చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే మాట్లాడుతూ… ఎన్నో మానవ ఉద్వేగాలను క్యాప్చర్ చేసి సామాన్యుడి విజయాన్ని సహజంగా ప్రేక్షకుల ముందకు తీసుకువచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చిందని, వ్యక్తి కథని సినిమాగా మలిచిన రాజ్‌ రాచకొండ ‘మల్లేశం’ని మట్టి వాసనలతో నింపాడని అన్నారు. తెలంగాణ పల్లెల్లో వినిపించే అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంతో, తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ మనుషుల జీవనాన్ని చూపించేందుకు చిత్ర యూనిట్ మొత్తం కృషిచేసిందని అన్నారు.

నటుడు మల్లేష్ బలస్ట్ మాట్లాడుతూ… నటుడి జీవితంలో తృప్తినిచ్చే సినిమాలో నటించడం కొన్ని సందర్భాల్లో లభిస్తాయని, మల్లేశంలో నటించడం తనకి చాలా తృప్తిని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రోషం బాలు, ఫిలిం మేకర్స్ యెన్నెన్జీ, సినీప్రియులు మరియు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ టీం పాల్గొన్నారు.

LEAVE A REPLY