తెలంగాణ సినిమాలకు దొరసాని దారి చూపుతుంది

0
30
views

తెలంగాణ యువ దర్శకుడు కెవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన దొరసాని సినిమా తెలంగాణ జీవితాన్ని చూపించిందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న టాక్ ఎట్ సినివారంలో 2019, ఆగస్టు 10న దొరసాని చిత్ర బృందంతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మామిడి హరికృష్ణ విచ్చేసి దొరసాని చిత్ర బృందాన్ని శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.

ఈ అనంతరం మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత సాహిత్య, సాంస్కృతిక, సినిమారంగాలలో అభివృద్ధి చెందే దిశగా దూసుకుపోతుందని, సినిమా తీయాలనుకుంటున్న యంగ్ ఫిలింమేకర్స్ కలల్ని గౌరవించే వేదిక ఉండాలనే సంకల్పంతో ఈ పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికను ఏర్పాటుచేశామని అన్నారు.

తమకున్న క్రియేటివ్ టాలెంట్ ని నిరూపించుకునే వేదికగా ఈ సినివారం రూపుదిద్దుకుందని, అందులోంచి వచ్చిన తెలంగాణ సినిమా ఆశాకిరణం కెవీఆర్ మహేంద్ర దొరసాని సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి తెలంగాణ సినీమాను మరికొంత ముందుకు తీసుకుపోయాడని అన్నారు. తన మొదటి షార్ట్ ఫిలిం నిశీధి ఈ ప్రివ్యూ థియేటర్ లోనే స్క్రీనింగ్ చేయబడిందిని, ఈ థియేటర్ తో అనుబంధం కలిగివున్న మహేంద్ర దొరసాని సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ హాల్ ఆఫ్ ఫేమ్ లో మహేంద్ర ఫోటోను పెట్టడం జరిగిందని అన్నారు.

దర్శకుడు కెవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ ఇదే వేదికమీద మొదటి ప్రదర్శన జరుపుకున్న నిశీధి షార్ట్ ఫిల్మ్ చూసి చాలామంది ప్రోత్సాహం అందించారని, 36 అంతర్జాతీయ వేదికల్లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శించబడిందని అన్నారు. ఆ షార్ట్ ఫిలిం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ ప్రేమకథ నేపథ్యంలోఒక జీవితాన్ని ఆవిష్కరించాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను రూపొందించానని, ఇందులో దాదాపు 60 మంది తెలంగాణకు చెందినవారిని నటులు సాంకేతిక నిపుణులుగా తీసుకున్నానని, సింక్ సౌండ్ తో రియల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ చేశానన్నారు. దొరసాని విడుదలైన తరువాత మంచి స్పందన వచ్చిందని, తెలంగాణలో గొప్ప చరిత్ర కలిగిన రవీంద్రభారతిలో నా ఫోటో పెట్టిన విషయం ఫేస్బుక్ లో చూసి ఉద్వేగానికి లోనయ్యాయని, ఆ గౌరవం నా బాధ్యతను పెంచిందని, నా ఫోటో చూసి స్ఫూర్తి పొంది యంగ్ ఫిలింమేకర్స్ సినిమాలు తీస్తే తాను చాలా సంతోషిస్తానని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో దొరసాని చిత్ర నటులు నితిన్, సన్నీ, సతీష్,నవీన్, వినోద్, అఖిల్ తదితరులు పాల్గొని యంగ్ ఫిలిం మేకర్స్, సినీప్రియులతో చిత్ర విశేషాలను, తమ అనుభవాలను పంచుకున్నారు.

LEAVE A REPLY