భారతీయ సినిమా, నాటకరంగం ఓ గొప్ప నటుడ్ని కోల్పోయింది: బిఎస్ రాములు

0
127
views

భారతీయ సినిమా, నాటకరంగం ఓ గొప్ప నటుడ్ని కోల్పోయిందని, అన్ని భాషల్లోని తన విలక్షణ నటనతో ఎప్పటికీ గుర్తుండిపోతారని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌ సంస్మరణార్ధం నిర్వహిస్తున్న గిరీష్ కర్నాడ్ ఫిలిం ఫెస్టివల్ సోమవారం ప్రారంభమైంది.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు హాజరై గిరీష్ కర్నాడ్ చిత్రపటానికి నివాళులు అర్పించి, ఫెస్టివల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బిఎస్ రాములు మాట్లాడుతూ భారతదేశం సాహిత్యకళారంగం గర్వించదగ్గ గొప్ప ప్రతిభాశీలి గిరీష్ కర్నాడ్ తను చూసిన సామాజిక సంఘటనలను ఇతివృత్తాలను నేపథ్యాలుగా తీసుకొని ఆయా అంశాలతో నాటకాలు, కథలు రాయడమే కాకుండా సినిమాలు కూడా తీశాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ సంస్కృతి కళల్ని పరిరక్షించడమేకాకుండా ఇతర రాష్ట్రాల, దేశాల సంస్కృతి కళలకు కూడా సముచిత గౌరవం అందుతున్నదని అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ నుండి గిరిష్ కర్నాడ్ కు సినీ నీరాజనంగా గిరీష్ కర్నాడ్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం మంచి పరిణామని పేర్కొంటూ, సంచాలకులు మామిడి హరికృష్ణను అభినందించారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల పాటు నాటక, సినీ, సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన గిరీష్ కర్నాడ్ బహుభాషా కోవిదుడని అన్నారు. ఆయన మృతితో భారత సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయిందన్నారు. సినీ, నాటక రంగాల్లో తన విలక్షణ నటన కారణంగా కర్నాడ్‌ కలకాలం గుర్తుండి పోతారని, ఆయన రచనలకు భవిష్యత్తులోనూ ప్రజాదరణ కొనసాగుతుంది అన్నారు.

గిరీష్ కర్నాడ్ కి నివాళిగా ఈ ఫిలిం ఫెస్టివల్ ను నేటి నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు మరియు సా. గం. 6.30 లకు ప్రదర్శించనున్నామని మామిడి హరికృష్ణ తెలిపారు.

సినిమా ప్రదర్శనల వివరాలు
సోమవారం (24.06.2019)
మ. 2 గంటలకు – సంస్కార (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – వంశవృక్ష (కన్నడ)

మంగళవారం (25.06.2019)
మ. 2 గంటలకు – కాడు (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – మంథన్ (హిందీ)

బుధవారం (26.06.2019)
మ. 2 గంటలకు – స్వామి (హిందీ)
సా. గం. 6.30 ని.లకు – ఉంబర్త (మరాఠి)

గురువారం (27.06.2019)
మ. 2 గంటలకు – ఆనందభైరవి (తెలుగు)
సా. గం. 6.30 ని.లకు – సూత్రధార్ (హిందీ)

శుక్రవారం (28.06.2019)
మ. 2 గంటలకు – నాగమండల (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – ఉత్సవ్ (హిందీ)

LEAVE A REPLY