మానవీయ విలువలకు నిలువెత్తు రూపం బాపూజీ

0
13
views

తను నమ్మిన సామాజిక, మానవీయ, నైతిక విలువలను జీవితాంతం కొనసాగించడం బాపూజీకే సాధ్యం. తాను నమ్మిన విలువలకోసం, ఆశించిన సమాజం కోసం నిలబడిన నిఖార్సైన నాయకుడు, నిబద్దతకు నిలువుటద్దం కొండా లక్ష్మణ్‌ బాపూజీ. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ఆర్థిక స్వావలంభన, స్వయం పాలన కోసం సాగుతున్న అన్ని తరాల పోరాటాల ప్రత్యక్ష భాగస్వామి. కార్యకర్త, నాయకుడు, అలుపెరుగని పోరాట యోధుడు బాపూజీ.

కొండా లక్ష్మణ్‌ 1915 సెప్టెంబర్‌ 27న ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి కుగ్రామంలో జన్మించారు. లక్ష్మణ్‌గారి మూడేళ్ళ వయసులోనే తల్లి అమ్మక్క మరణించారు. అమ్మ ఒడిలో లాలన పొందవలసిన వయసులోనే విషాదంతో ఘనీభవించిందాయన హృదయం. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఆటుపోటులు ఎదురైనా తలొగ్గని వ్యక్తిత్వంలో పెరిగారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న లక్ష్మణ్‌గారు 17 సంవత్సరాల వయస్సులోనే కాలినడకన వెళ్లి మహాత్మా గాంధీని చూసిన వ్యక్తి ఆయన.

చిన్ననాటి నుంచి జట్టుకట్టడం, మాటలతో తోటివారిని ఆకర్షించడం వంటి నాయకత్వ లక్షణాలు సహజంగానే ఆయనలో వున్నాయి. దానికితోడు అన్యాయాన్ని సహించలేని ఉద్రేకం కూడా పెరుగుతూ వచ్చింది. ఆయన తోటి యువకులను వెంటేసుకుని మూఢనమ్మకాలు, కులాచారాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్ష, అణిచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. చురుకైన విద్యార్థి కావడంతో బడిలో ఆటపాటలు, వక్తృత్వ పోటీలు, విహార యాత్రలు వంటివి నిర్వహించడంలో ఎప్పుడూ ముందుండేవారు. యువతలో దేశభక్తి, జాతీయభావాలు పెంపొందించడంలో కీలక భూమిక పోషించారు.

యువకుడిగా వున్నప్పుడే పల్లెలో భూస్వాములకు వ్యతిరేకంగా తోటి యువజనులతో సంఘాలు ఏర్పాటు చేయించారు. హైస్కూలు విద్య కోసం హైదరాబాద్‌ నగరానికి చేరిన బాపూజీ ఆ తర్వాత హైకోర్టువారు నిర్వహించిన రెండు సంవత్సరాల ‘లా’ కోర్సులో చేరి 1940లో మూడవ గ్రేడు ప్లీడరు పరీక్షలో విజయం సాధించి అదే సంవత్సరం హైదరాబాదులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1944లో రెండవ గ్రేడు, మరుసటి సంవత్సరం మొదటి గ్రేడ్‌ ప్లీడరు పరీక్షలోనూ ఉత్తీర్ణులై హైకోర్టు ప్లీడరుగా నమోదైనారు. అనతి కాలంలోనే ప్రఖ్యాత న్యాయవాదులలో ఒకరుగా గుర్తింపు పొందారు. 1957లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన పిదప న్యాయవాద వృత్తిని వదిలివేశారు.

గాంధీజీని కలవాలని ఉవ్విళ్లూరే బాపూజీ, చాందకు గాంధీజీ వస్తున్నారన్న సమాచారంతో, గాంధీజీని కలవరాదని నిజాం ప్రభుత్వం, పాఠశాల అధికారుల ఆదేశాలు వున్నా వాటిని ధిక్కరించి కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ఆయన స్నేహితులు చాంద వెళ్లి గాంధీజీని కలిశారు. గాంధీజీ మాటలతో కొత్త చైతన్యం నింపుకున్నారు.
క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు బాపూజీ. హైదరాబాద్‌లో నిర్వహించిన సత్యాగ్రహానికి అరెస్టు అయ్యారు. 1940లో న్యాయవాదిగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరుఫున వాదించి కేసులను గెలిపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సాహాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య ఆకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడారు. 1947 డిసెంబర్‌ 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్‌ బృందంలో కొండా లక్ష్మణ్‌ కూడా సభ్యుడే. బాంబు విసిరిన పవార్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. బాంబు దాడి తర్వాత నిజాం ప్రభుత్వం కొండా లక్ష్మణ్‌ బాపూజీని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన షోలాపూర్‌, బొంబాయికి వెళ్ళారు. చాలాకాలం అజ్ఞాతంలో ఉండిపోయారు. సెప్టెంబర్‌ 1948లో పోలీసు యాక్షన్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఆయనపై పెట్టిన కేసులన్నీ కొత్త ప్రభుత్వం ఉపసంహరించింది.

1952లో తొలిసారిగా ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 1957లో నల్లగొండ జిల్లా చిన్నకొండూరు నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా గెలిచారు. అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసు వేసి గెలిచారు. 1965లో ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు.

కాసుబ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో 1969 మార్చి 27న మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా బాపూజీదే. రాజకీయ రంగంలో తనదైన ముద్రవేశారు. సామర్థ్యం, సచ్చీలత ఆయనను రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి రేసులో నిలబెట్టాయి. అయితే కుల సమీకరణలు, కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాల కారణంగా ఆయన అవకాశం కోల్పోవలసి వచ్చింది. మండల్‌ కమీషన్‌ సిఫార్సులను మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వ్యతిరేకించడంలో నిరసనగా కొండాలక్ష్మణÊ బాపూజీ 1990లో కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

1968 తెలంగాణ ఉద్యమంలో బాపూజీని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. విడుదలయ్యాక తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ కొనసాగించారు. 1997 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తనవంతు కర్తవ్యం స్వాతంత్య్ర సమరయోధులను, బిసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను ఒకతాటిమీదకి తెచ్చి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం చివరి క్షణం దాకా కృషి చేశారు. 1997లో తెలంగాణ ప్రజాపార్టీ, 2007లో తెలంగాణ రాష్ట్రసాధన సమితి సంస్థలను స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి బాపూజీ. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ దానికి కేంద్ర కార్యాలయంగా తన ఇల్లునే అందించిన సహృదయ సౌజన్య శీలి బాపూజీ.

జనాభాలో 50 శాతంకు పైగా గల వెనుకబడిన తరగతులకు సమాజిక న్యాయం కోసం, వారి సంక్షేమం కోసం, సాధికారత కోసం, బిసి వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాలను ఒక్కటి చేయడానికి జీవితమంతా కృషి చేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా, సామాజికంగా, సాధికారికత సాధించడానికి అనేక సంస్థలను, ఉద్యమాలను నిర్మించారు. 1943లోనే చేనేత సంక్షేమ సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సంవత్సరమే నిజాం రాష్ట్ర పద్మశాలీ కష్టనివారణ మహాసభను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ తాలూకాలోని మోర్తాడ్‌లో నిర్వహించారు.

హైదరాబాద్‌లోని కాచిగూడ రాజ్‌మొహల్లాలో పద్మశాలీ భవనం, హాస్టల్‌ నిర్మాణంలో ఇతోధికంగా కృషి చేశారు. 1950 ఫిబ్రవరి 19న హైదరాబాద్‌ హ్యాండ్లూం వీవర్స్‌ సెంట్రల్‌ కో – ఆపరేటివ్‌ అసోసియేషన్‌ రిజిష్టర్‌ చేశారు. దానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అధ్యక్షులుగా వ్యవహరించారు. వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యా అభ్యున్నతిపై కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అకుంఠిత దీక్ష కారణంగానే హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వృత్తి నిర్వహించే 15 కులాలకు విద్యా సదుపాయాల కల్పించేందుకు వెనుకబడిన కులాల జాబితాలో చేర్చింది. 1944 నుంచి 1960 వరకు రాష్ట్ర పద్మశాలీ మహాసభ అధ్యక్షుడిగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యవహరించారు.

నిజాయితీపరులు, విలువలు కలిగినవారు నిలబడినంత కాలం వ్యవస్థలు నిలదొక్కుకుంటాయని నమ్మి అంతర్జాతీయ, జాతీయ విపణి శక్తుల ఒత్తిడులకు లొంగకుండా నవభారత సమాజాన్ని నిర్మించడం ద్వారానే అశేష ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. 97 సంవత్సరాల పరిపూర్ణ జీవితం బాపూజీది. నైతిక విలువలతో కూడిన మానవీయ తెలంగాణ పునః నిర్మాణమే బాపూజీకి మనమర్పించే నిజమైన నివాళి.

– డాక్టర్‌ బోనకుర్తి సోమేశ్వర్‌

LEAVE A REPLY