వాహనదారులార … జాగ్రత్త

0
42
views

వాహనదారులు ఇకపై మరింత అప్రమత్తంగా ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారికి ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానాలు (చలాన్‌) ఇక మరింత ప్రియం కానున్నాయి. 1988 నాటి మోటారు వాహనాల చట్టానికి గత నెల పార్లమెంటులో సవరణలు చేసిన సంగతి తెలిసిందే. మోటారు వాహనాల (సవరణ) చట్టం-2019 ప్రకారం కొత్త జరిమానాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

దీని ప్రకారం అత్యవరసర వాహనాలైన ఫైర్‌ ఇంజిన్‌, అంబులెన్స్‌ వంటి వాటికి దారి ఇవ్వకపోతే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఇప్పటివరకూ రూ.100 జరిమానా ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు రూ.500 చలానా విధించే వెసులుబాటు ఉంటుంది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తే రూ.2 వేలు, లైసైన్స్‌ ఇంటివద్ద మర్చిపోతే రూ.5 వేలు, వాహనం ఇన్సూరెన్స్‌ కాపీ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే రూ.2 వేలు పెనాల్టీలు విధించనున్నారు. మైనర్లు వాహనం నడిపితే 25 వేల జరిమానా విధించనున్నారు.

రోడ్డుపై అనుమతించిన వేగం కన్నా ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తే రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, సీట్‌బెల్టు లేకుండా ప్రయాణిస్తే రూ.వెయ్యి వరకూ జరిమానాలు విధిస్తారు. ఇక ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ హెల్మెట్ ధరించకపోతే రూ.1000 కట్టాల్సిందే. పరిమితికి మించి లోడ్‌తో వెళ్లే వాహనాలకు రూ.20 వేలు, ర్యాష్‌ డ్రైవింగ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు చలానా వేస్తారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

కొత్త మోటారు వాహన చట్టంపై రాష్ట్రంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. ‘ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి.. డబ్బులు మిగుల్చుకోండి’ అంటూ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు చౌరస్తాల్లో బోర్డులు పెట్టి మరీ పాజిటివ్‌ ప్రచారం చేస్తున్నారు. సొంత వాహనాలపై ప్రయాణించే వారు ఇకపై మరింత అప్రమత్తంగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY